Wednesday, July 14, 2010

కామన్వెల్త్‌కు బాక్సర్ల వెల్లువ

దేశరాజధాని నగరంలో జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో రికార్డు సంఖ్యలో 304 మంది అంతర్జాతీయ బాక్సర్లు పాల్గొననున్నారు. అక్టోబర్‌ 3 నుండి 14 జరగనున్న ఈ మెగా ఉత్సవంలో బాక్సింగ్‌ అందరి దృష్టినీ ఆకర్షించనుంది. ఒక్క ఆఫ్రికా ఖండం నుండే 118 మంది పాల్గొననున్నారు. ఆఫ్రికా ఖండలోని ఘనా, కెన్యా, నైజీరియా, టాంజేనియా దేశాలు పూర్తిగా పదిమందితో కూడిన స్క్వాడ్లను విడివిడిగా పంపనున్నాయి. మొత్తం మీద ఆఫ్రికా ఖండం నుండి 18 జట్లు పాల్గొంటాయి. యూరప్‌, ఓసియానా 45 మంది బాక్సర్ల చొప్పున పంపనున్నాయి. యూరోపియన్‌ పవర్‌ హౌసెస్‌ ఇంగ్లండ్‌, ఉత్తర ఐర్లండ్‌ పది మందితో పూర్తి స్థాయి జట్లను పంపుతాయి. బాక్సింగ్‌కు సంబంధించినంతవరకు ఢిల్లీ కామన్వెల్త్‌ గేమ్స్‌ అత్యంత పెద్ద గేమ్స్‌ కానున్నాయని టోర్నమెంట్‌ డైరెక్టర్‌ లెన్ని డి గామా పేర్కొన్నారు. బాక్సింగ్‌లో అన్ని విభాగాలకు అద్భుత ప్రతిస్పందన వస్తోందని చెప్పారు.అయితే ఆయా దేశాలు తాము పంపే బాక్సర్ల పేర్లను ఇంకా ఇవ్వలేదని చెప్పారు. ఓషియానాలో ఆస్ట్రేలియామొత్తం పది విభాగాల్లో బాక్సర్లను పంపుతుంది. న్యూజిలాండ్‌ ఎనిమిది విభాగాల్లో పాల్గొంటుంది. లైట్‌వెయిట్‌(60 కిలోలు), వెల్టర్‌ వెయిట్‌లో (69)లో డ్రా కష్టంగా పరిణమించనుంది. సూపర్‌ హెవీ వెయిట్‌ (+91 కిలోలు) విభాగంలో మాత్రం పోటీ తక్కువగా ఉంది. ఈ విభాగానికి 17 ఎంట్రీలు మాత్రమే వచ్చాయి.
కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత బాక్సర్లకు మంచి రికార్డే ఉంది. మహ్మద్‌ అలి కమర్‌ (2002 మాంఛెస్టర్‌), అఖిల్‌కుమార్‌ (2006, మెల్బోర్న్‌)స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఈ రెండు ఎడిషన్లలోనే బాక్సింగ్‌ పోటీలు జరిగాయి. 2002 గేమ్స్‌లో వీటిని ప్రవేశపెట్టారు. మెల్బోర్న్‌లో భారత బాక్సర్లు ఆరు పతకాలు సంపాదించిపెట్టారు. అఖిల్‌ 54 కిలోల్లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఒలింపిక్‌ కాంస్య పతక విజేత విజేందర్‌ సింగ్‌ రజిత పతకం గెలుచుకున్నాడు. బాక్సింగ్‌ పోటీలు కొత్తగా నిర్మించిన తల్కతోరా స్టేడియంలో నిర్వహించారు. ఈ స్టేడియంలో ఈ ఏడాది మార్చిలో కామన్వెల్త్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ జరిగింది.