Sunday, November 21, 2010

క్రికెట్‌లో, ఆసియా గేమ్స్‌లో భారత్‌ హల్‌చల్‌


16వ ఆసియా గేమ్స్‌లో భారత్‌
స్టీపుల్‌ ఛేజ్‌లో సుధా సింగ్‌
షూటింగ్‌లో రంజన్‌ సోథీ
రన్నింగ్‌లో ప్రీజా శ్రీథరన్‌లకు స్వర్ణాలు

క్రికెట్‌లో సెహ్వగ్‌, గంభీర్‌, ద్రావిడ్‌ హాఫ్‌ సెంచరీలు
50వ సెంచరీకి చేరువలో సచిన్‌
99 పరుగుల ఆధిక్యంలో భారత్‌
న్యూజిలాండ్‌ 193 పరుగులకు ఆలౌట్‌


ఆదివారం... అందరు ఇష్టపడే రోజు... ఈ ఆదివారం క్రీడాభిమానులకైతే పండగలా మారింది. అటు చైనాలోని గువాంగ్జౌలో జరుగుతున్న 16 ఆసియాడ్‌లో భారత క్రీడాకారులు 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాలు సాధించారు. ఇటు క్రికెట్‌లో న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు విజృంభించడంతో రెండో రోజు ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యతతో కొనసాగుతుంది.


16వ ఆసియాడ్‌లో 9వ రోజు భారత్‌కు 3 స్వర్ణాలు లభించాయి. మొదటిది షూటింగ్‌ విభాగంలో తొలి స్వర్ణాన్ని రంజిత్‌ సోథీ అందించాడు. వ్యక్తిగత విభాగంలో అతడు 50కి 50 పాయింట్లతో ఈ పతకాన్ని సాధించాడు. టీం విభాగంలో రంజిత్‌ సోథీ, ఆషర్‌ నోరియా, విక్రస్‌ భట్నాగర్‌లకు కాంస్య పతకం లభించింది. రెండోది మహిళల 10 వేల మీటర్ల రన్నింగ్‌ రేస్‌లో ప్రీజా శ్రీథరన్‌ స్వర్ణం అందుకుంది. ఇదే రేస్‌లో రెండో స్థానంలో వచ్చిన కవితా రనౌత్‌ రజితం చేజిక్కించుకుంది. మూడో స్వర్ణం సుధా సింగ్‌ను వరించింది. ఈమె మూడు వేల మీటర్ల స్టీపుల్స్‌లో 9:55.67 నిమిషాల్లో ఛేజ్‌ చేసి ఈ స్వర్ణాన్ని గెలుచుకుంది.

నాగ్‌పూర్‌ టెస్టులో ఆదివారం నాడు 193 పరుగులకే న్యూజిలాండ్‌ను ఆలౌట్‌ చేసిన భారత ఆటగాళ్లు బ్యాటింగ్‌లో తమ సత్తా చాటారు. ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వగ్‌, గౌతం గంభీర్‌లు తొలి వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సెహ్వగ్‌ తనదైన శైలిలో 73 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేశాడు. గౌతం గంభీర్‌ 78 పరుగులతో సెంచరీ వైపు దూసుకెళుతుండగా సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మిస్టర్‌ డిపెండబుల్‌(69 నాటౌట్‌), మాస్టర్‌ బ్లాస్టర్‌లు(57 నాటౌట్‌) న్యూజిలాండ్‌ బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొని హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశారు. మ్యాచ్‌ ముగిసే సమయానికి భారత్‌ 2 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. 57 పరుగులతో క్రీజ్‌లో ఉన్న సచిన్‌ టెస్టుల్లో తన 50 సెంచరీని పూర్తి చేస్తాడని కోరుకుందాం.....

No comments: